పది సేర్ల జొన్నలు.............
న్యూయార్క్ సిటీ ,లింకన్ ఆడిటోరియం .
అమెరికాలోని తెలుగు సంఘాల సభ్యులంతా అక్కడ సమావేశమయ్యారు.తెలుగు, ఇంగ్లీష్ లతో అక్కడ కలగాపులగంగా ఉంది.జీన్స్ ధియరీలో కొత్త సత్యాలను బయట ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత గా గుర్తింపు పొందిన డాక్టర్ జొన్నలకు ఆ రోజు సన్మానం.ముప్పై ఏళ్ళ వయసులోనే ఆయన ఇంత గొప్ప గౌరవాన్ని పొందారు.ఆయన పరిశోధనలు పూర్తి స్థాయి లో విజయవంతమయితే మనిషి జీవిత కాలమే మారిపోతుంది.
ఆడిటోరియం బయట డాక్టర్ జొన్నల ఎదురు చూపులు చూస్తున్నాడు.తన చుట్టూ ఎంత మంది ఉన్నా ఆయనకి లోటు గానే ఉంది.ఆయన చాలా సింపుల్ గా ఉన్నాడు.కళ్ళు మాత్రం జ్ఞానం తో వెలిగిపోతున్నాయి .
ఇంతలో ఒక కారు నుంచి ఒక ముసలాయన్ని మెల్లిగా దించి వీల్ చైర్ లో కుర్చోపెట్టారు.ఆయన వయసు ఎనభై .పండు టాకులా ఉన్నాడు.
ఆయన్ని చూడగానే జొన్నల పరుగున వచ్చి 'తాతయ్యా' అని ఆప్యాయంగా చెయ్యి పట్టుకున్నాడు.మనుమడిని చూడగానే ముసలాయన గాజు కళ్ళలోకి కొత్త కాంతి వచ్చింది.
'ప్రయాణం బాగానే జరిగింది కదా' అని తాతాయ్య పక్కనున్న తండ్రి అడిగాడు."అంత దూరం తను ప్రయాణం చేయలేనని నాన్న మొండికేసారు .రాకపోతే నువ్వు బాధపడతావని చెబితే అప్పుడు ఒప్పుకున్నాడు".
తండ్రి మాటలు విని ఆప్యాయంగా తాతయ్య తల నిమిరాడు జొన్నల.తన కోసం ఇండియా నుండి వచాడు తాతయ్య.
జాగ్రత్తగా ముసలాయన్ని లోనికి తీసుకెళ్ళారు.సభ ప్రారంభ మయ్యింది.ఒక్కొక్కరూ వచ్చి డాక్టర్ జొన్నల గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు.
"డాక్టర్ జొన్నల ప్రపంచం లో గొప్ప మేధావులో ఒకరు.చిన్న వయసులోనే గొప్ప పేరును ఆయన సంపాదించారు.ఈ ఇంటిలెక్చుయాలిటి ఆయన జీన్స్ లోనే బహుశా ఉండి ఉంటుంది" ఇలా సాగుతున్నాయి ఉపన్యాసాలు.
జొన్నల పేరు వినగానే కురిపిస్తున్న ప్రశంసలు,మారుమ్రోగుతున్న చప్పట్లు విని ముసలాయన కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి.
బుగ్గల మీద జారిపోతున్న కన్నీళ్లని తుడుచుకున్నాడు.మనసులోని ఉద్వేగం కంట్రోల్ అవ్వడం లేదు.
ఈ జొన్నల అనే పేరు ఒకప్పుడు అవమానాలకు ఆలవాలం.దీని వెనుక దాచేస్తే దాగని కధ ఉంది.గుండెల్లోంచి నిరంతరం ఎగదన్నుకొచ్చే కన్నీటి బుగ్గ ఉంది.
తల్లి కడుపు కోతను,ఒక జీవితానికి సరిపడే విషాదాన్ని ఈ జొన్నలు తమలో ఇముడ్చుకున్నాయి.
ముసలాయన కళ్ళ ముందు ఒక దృశ్యం కదలాడింది.నిద్రలో కూడా మేడిలో దృశ్యమది.జొన్నల మూట భుజాన వేసుకుని చీకట్లో కలిసిపోతున్న దంపతుల నీడలు కనిపించాయి.
తన కన్నీళ్ళు తుడుస్తూ తండ్రి చెప్పిన కధ.
గుండెల్లోకి చేర్చుకుని తల్లి చెప్పిన కధ.
తన జీవితాన్నే మార్చిన పదిసేర్ల జొన్నల కదా.కాళ్ళ ముందున్న దృశ్యాలు కన్నీళ్లతో అలుక్కు పోయి ఎనభై ఏళ్ళు వెనక్కు లాగాయి.
* * * * *
అనంతపురం ప్రాంతం లో ఒక మారుమూల కరువు పల్లెటూరు.
"రెండేండ్ల నుంచి కరువు ఈడ్చి ఈడ్చి కొడతా ఉంది.ఈసారి కూడా వాన దేవుడికి దయ లేకుండా పాయ"బార్య తో అన్నాడు రామన్న.
ఆయన బార్య లచ్చమ్మ అవునన్నట్లు తల ఊపింది.
చమురు దీపం నీరసం గ వెలుగుతూ ఉంది.రాత్రి ఎనిమిది గంటల సమయం.బార్య భర్తలిద్దరూ జొన్న రొట్టెలు తిని నిద్ర కుపక్రమించారు.
ఇంట్లో ఒక మూల కట్టేసిన బక్కచిక్కిన ఎద్దులు,తమ ముందున్న కసువును వెతుక్కుని తింటున్నాయి.
"ఊళ్ళో అందరికి మనమంటే కుళ్ళు"అంది లచ్చమ్మ.
"ఏంటికో"అని అడిగాడు రామన్న.
"అన్నో ఇన్నో జొన్నలు ఉండేది మనింట్లోనే.అందరి కత అద్దు మానం గా ఉంది.టవున్ లో దొరలూ గంజి పోస్తా ఉండారని బీద బిక్కి అంత పోతా ఉండారు.
"అందరిండ్లలో పిల్లోళ్లు ఉండారు.బిడ్డలేక మనమెంత దుఖం గా ఉండామో ఎవురికి తెలుసు.కడుపు నిండితే మనుషులకి సంతోషం వస్తుందా."విషాదం గా అన్నాడు రామన్న.
ఇంతలో దొడ్డి వాకిలి శ బ్దమైనది ."అమ్మా"అంటూ ఎవరిదో పిలుపు వినిపించింది.
"ఇయ్యాలకాడ,ఎవరబ్బా"అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది లచ్చమ్మ.
చీకట్లో రెండు ఆకారాలు కనిపించాయి.
చమురు బుడ్డి తీసుకుని రామన్న వచాడు.చిరిగి పోయిన బట్టలతో పీక్కుపోయిన ముఖాలతో ఒక ఆడది,ఒక మొగోడు ఎదురుగ కనిపించరు.ఆమె మెడకు వేలాడుతున్న పాత బట్టలో చిన్న బిడ్డ నిద్ర పోతు కనిపించాడు.అ బిడ్డ వైపు కొంచం ఆసక్తిగా చూసింది లచ్చమ్మ.
"ఎవుర్రా మీరు ?"అని అడిగాడు రామన్న.
"బీదనాకొడుకులమయ్యా"చెప్పాడు మగ మనిషి.
ఇంట్లోకి రాకుండా జాగ్రతపడుతూ దూరం గా జరుగుతూ .
"ఇయ్యాలకాడ ఎందుకోచ్చినారు?"ఆచ్యర్యంగా అడిగాడు రామన్న.
"అయ్యా,పందుల్ని మేపుకుంటూ ఊరూరా తిరుగుత ఉన్నాం.తిండి లేక పందులు కూడా సచిపోయినాయి.మనుషులే దుమ్ము నాకుతా ఉంటె ఇంగ పందులు ఎట్టా బతకతాయి.నిన్న పొద్దున తినిన కూడయ్య,ఎవుర్నడిగిన ఎం పెట్టేట్టులేరు.సంకలో పిల్లోడు కాకుండా ఇంగా ముగ్గురు పిల్లోల్లు ఉండారు.కూడులేక సచ్చిపోతరయ్య"అని చెప్పాడు మగ మనిషి.
బిడ్డను చూడగానే లచ్చమ్మ కళ్ళల్లో తడి తగిలింది.
"ఏమ్మా,సంనబిడ్డ తల్లివి కదా,కూడు లేకుండా ఉంటె పాలెట్లవస్తాయి"అంటూ గబాలున వెళ్లి రెండు జొన్న రొట్టెలు తేచి అ అమ్మి చేతిలో పెట్టింది.ఆమె ఆత్రంగా తీసుకుంది.
"అయ్యా,పది సర్ల జోన్నలిప్పించు"మెల్లిగా అడిగాడు మగమనిషి.
రామన్న ఆశ్చర్యంగా చూసి "ఏందిరా తిక్కలోడి మాదిరుండవే.ఈ రొట్టెలు ఇచ్చిందే ఎక్కువ నీకు"అన్నాడు.
"ఊరికే వద్దయ్యా,మా బిడ్డను తీసుకుని ఇయ్యి"నూతిలో నుంచి వస్తున్నట్లుగా ఉంది మాట.
భార్యభార్తలిద్దరు నిశ్చేష్టులై అతని వైపు చూసారు.ఎరుకలమ్మి తినడం ఆపి మొగుడి వైపు చూసింది.
"ఎందిరా ,ఏమంటున్నావ్ ?"విచిత్రం గా చూస్తూ అడిగాడు రామన్న.
"మీకు పిల్లోల్లు లేరంటకదయ్యా,అందుకే ఈ బిడ్డను తీసుకో.మా దగ్గరుంటే పాలు లేక సచిపోతరయ్య.మీరిచే జొన్నలతో మిగిలిన పిల్లోలన్నా బతుకుతారు."
లచ్చమ తేరుకుని "తల్లి బిడ్డని ఏరు చేసిన పాపం మాకేంటి,కావాలంటే సేరు జొన్నలు ఊరికే ఇష్టం ఎల్లిపొండి"అంది కొంచం కోపంగా.
ఆ మగ మనిషి రామన్న కాళ్ళ మీద పడి "సతెంగా అంటాఉండా, ఈ కరువులో ఈ బిడ్డని మేం సాకలేం.మీ దగ్గరన్న ఉంటె సుకంగా ఉంటాడు"అన్నాడు.
"నా మొగుడు సెప్పింది నిజమయ్య.నేను కూడా మనసుకి కష్టం లీకుండ బిడ్డనిస్తాఉండాను"అని ఆ తల్లి బిడ్డని చేతిలోకి తీసుకొంది.
నిద్రలో బిడ్డ అటు ఇటు కదిలి 'కిక్' అంటూ మూలిగాడు.
'ఎండిపోయినట్లున్నా,కళగానే ఉన్నాడు'అనుకుంది లచ్చమ్మ బిడ్డని చూసి.
రామన్న బార్య వైపు చూసాడు.బిడ్డని తీసుకోవాలనే ఇష్టం ఆమె మొహంలో కనిపించింది.
నేరుగా ఇంట్లోకి వెళ్లి ఒక సంచిలో జొన్నలు పోసుకువచ్చి ఆ మగ మనిషి చేతిలో పెట్టాడు.బిడ్డ చేతులు మారింది.
ఆకరిసారుగా బిడ్డను కళ్ళ నిండా చూస్కుని అ పేద దంపతులు జొన్నల మూటతో చీకటిలో కలిసిపోయారు.
ఆ రాత్రి బిడ్డ స్పర్శ తగిలినప్పుడల్లా అది కలేనని అనుకుంది లచ్చమ్మ.
తెల్లారకముందే పక్కింటి సూరమ్మ ప్రత్యక్షమైంది.
"ఏందే,లచ్చమూ,మీ ఇంట్లో పిల్లోడి ఏడుపు యినిపిస్తుంది.రాత్రికి రాత్రే బిడ్డెట్ట పుట్టినాడే"అనుకుంటూ ఇంట్లోకి కాలుపెట్టి లచ్చమ్మ చేతిలోని బిడ్డను చూసి శిలావిగ్రహం మాదిరి నిలబడిపోయింది.కొన్ని క్షణాలు ఆమె నోట్లో మాట రాలేదు.కాసేపటికి తీరుకుని "ఎవుడే ఈడు"అని అడిగింది.
ఎం చెప్పాలో లచ్చమ్మకి అర్థం కాక "దేవుడిచినాడు "అంది.
"దేవుడే నేరుగా వచ్చి బిద్దల్నిస్తావుంటే,ఇంగ ప్రపంచంలో ఎవురు కాపురాలే చేసుకోరు.నిజం చెప్పు లచ్చమ్ము"అంది వెటకారంగ సూరమ్మ.
నిజం చెప్పక తప్పలేదు లచ్చమ్మకి.
అంత విని"ఏందీ?కొనుక్కుండావ?వాళ్ళేం జాతో,కులమో!ఈ ఇసయం తెలిస్తే ఊరంతా వచ్చి మూయద మొగాన"అంది సూరమ్మ.
"మూసినా తుడుచుకుని పోతాను.బిడ్డను ఇదిసిపెట్టను"అంది లచ్చమ్మ.
కొన్ని గంటల స్పర్శకే ఆమె తల్లికి మించిన తల్లయిపోయింది.
"అంతే"అన్నాడు రామన్న.
కాసేపటికే ఊరంతా తెలిసిపోయింది.అందరు వచ్చి పిల్లోన్ని చూసి రకరకాలుగా మాట్లాడి వెళ్లారు.రామన్న,లచ్చమ్మ మౌనంగా ఉండిపోయారు.మంది మాటలకు సమాధానం చెప్పటం కష్టమని వారికి తెలుసు.
సాయంత్రానికి జువ్విచెట్టు కింద పంచాయితి మొదలైంది.ఊరంతా వచ్చింది.రామన్న,లచ్చమ్మ రాగానే ఒక్క సారిగా అలజడి మొదలయ్యింది.బిడ్డ మొహం మీద వాలుతున్న ఈగల్ని తోలుతూ,ఆప్యాయంగా చూసుకుంటున్న లచ్చమ్మని చూసి అమ్మలక్కలంతా చెవులు కోరుకుంటున్నారు.
"ఎం రామన్న,పందులు మీపుకునే పిల్లోన్ని జోన్నలిచి కొనుక్కుండావంట?"అడిగాడు పంచాయితి పెద్ద.
అవునన్నట్లు తల ఊపాడు రామన్న.
"పందుల్లోలంటే కడ జాతి మనుసులు.వాళ్ళని మనం ఇంట్లోకి రానీయం.వాళ్ళు ముట్టిన వస్తువుని మనం బయట పారేస్తాం.అట్లాంటిది నువ్వు వాళ్ళ రక్తాన్నే ఇంటికి తెచ్చుకున్డావు".
రామన్న మౌనంగా ఉండిపోయాడు.
"మించిపోయిందేమీ లేదు.సుట్టుపక్కల యాడున్న వాళ్ళని పిలిపిస్తాం,బిడ్డని ఎనక్కి ఇచేయి."
లచ్చమ్మ భయంభయంగా బిడ్డని గుండెలకి హత్తుకుంది.
కాసేపు నిశబ్ధం.
రామన్న ఎం చెబుతాడో నని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.రామన్న మెల్లిగా తల పైకెత్తి "కుదరదు.ఆ బిడ్డ మాతోనే ఉంటాడు"అని అన్నాడు.అతని కళ్ళలో ధృడ నిశ్చయం కనిపిస్తుంది.
పంచాయితి పెద్దకు కోపమొచ్చింది."
"ఊరంటే ఒక పద్ధతి,కట్టుబాట్లు ఉంటాయి.ఎవురిస్తమొచినట్లు వాళ్ళు ఎగుర్లేయాలంటే జరగదు.నీ ఇష్టప్రకారమే ఉండాలంటే మా నిర్ణయం కూడా విను.పిల్లోన్ని నువ్వు పెంచుకుంటే,ఊర్లో ఎవ్వురు నీతో మాట్లాడారు.నీ ఇంటికి రారు.నిన్ను పిలవరు.ఒకరకంగా నిన్ను ఊర్లోనుంచి ఎలివేసినట్లే"అని గంభీరమైన గొంతుకతో చెప్పాడు.
ఆ మాటలు విని లచ్చమ్మ ఏడవసాగింది.
పంచాయితీలో రామన్న మౌనంగా పైకి లేచాడు.భార్య చేయి పట్టుకుని పైకి లేపాడు.బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు.
"నేనే ఈ ఊరిని ఎలివేస్తుండా"అని కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు.
* * * * *
మరుసటి రోజు ఉదయమే ఇంట్లో ఉన్న కాసిని సామాన్లని బండిమీద వేసుకుని రెండు ఎనుముగొడ్లని వెంటబెట్టుకుని భార్య బిడ్డలతో ఊర్లోనుంచి రామన్న బయలుదేరాడు.
ఊరంతా ఇళ్ళల్లో నుంచి బయటికి వచ్చి చూసింది.
"ఏంది మామా,రెట్టమతంగా ఉండవు.రోన్నాళ్ళు పోతే అన్ని సర్దుకుంటాయి"అని ఊర్లో వాళ్ళు ఒకరిదరు చెప్పి చూశారు.
"నా బిడ్డ అవమానాల మధ్య పెరిగేది నాకిష్టం లేదు"అని బండి ముందుకి పోనిచ్చాడు.
ఉన్న ఊరు వదిలి టవున్ చేరుకున్నారు.లచ్చమ్మ ఎనుముల్ని చూసుకుంటూ పాలు అమ్ముకుని వచ్చేది.రామన్న బండల గనుల్లో పనికి పోయేవాడు.రైతుగా బతికినా మొగుడు కూలోడి మాదిరిగా పనిచేస్తాఉంటె లచ్చమ్మ కుమిలిపోయేది.బండల పనికి ఒళ్ళు హూనమైపోయేది రామన్నకి.సాయంత్రం ఇంటికోచి ఉడుకుడుకు నీళ్ళు పోసుకుని,పిల్లోన్ని ఎత్తుకునేసరికి కష్టమంతా మర్చిపోయేవాడు.బిడ్డకి నడక వచ్చింది.తమ చేతుల మీద నడిపించారు.తొలిసారిగా అమ్మా అనేసరికి లచ్చమ్మకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.ఊళ్ళో ఏ చిన్న రోగాలు రోస్తులు ఉన్నాయని తెలిసిన సరే,గువ్వా పిల్లని కాపాడినట్లు కొడుకుని కాపాడేది లచ్చమ్మ.కనిపించిన దేవుదికల్లా మొక్కి తాయెత్తులు కట్టించేది.వాడికి నోట్లో పండ్లు వచినప్పుడు వాడు రక్తమొచ్చేలా కొరికినా సరే,నవ్వుతూనే ఉండింది.వాడికి అన్నం తినిపించడానికి చందమామనే భూమిమీదకి దింపేది.బిడ్డ తింటే అమృతం,తాము తింటే విషం అనుకునేవాళ్లు.
బిడ్డకి ఐదేళ్ళు వచ్చేసరికి చదువుకి వేద్దామని నదీతీరంలో చదువు చెబుతున్న పంతులు దగ్గరికి కొడుకుని తీసుకెళ్ళారు.అల్లంత దూరంలోనే పంతులు వారిని ఆపేశాడు.
"బిడ్డకు చదువు చెప్పాలయ్య"అన్నాడు రామన్న.
"నీచ జాతికి నేను చదువు చెప్పను"అన్నాడు పంతులు.
రామన్న కళ్ళ నీళ్ళు తుడుచుకున్నాడు.
"మీ ఊర్లో వాళ్ళ వల్ల నాకంత తెలుసు.ఇక నువ్వు వెళ్ళవచ్చు"అన్నాడు పంతులు.
ఈ సంగటన జరిగిన కొద్ది రోజులకే వీధిలోని పిల్లలంతా రామన్న కొడుకుని 'జోన్నలోడ'అని పిలిచి ఏడిపించసాగారు.
పసివాడికి ఆ ఎగతాళి అర్థం కాక ఇంటికొచ్చి తల్లిని అడిగేవాడు.లచ్చమ్మ వాడి కనీళ్ళు తుడవడంలో తన కన్నీళ్ళు తుడుచుకోవడం మర్చిపోయేది.
ఒక రోజు రామన్న ఇంట్లోని సామానంతా సర్ది"మనం ఈ ఊరు వదిలి అనంతపురం వెళ్ళిపోదాం"అన్నాడు.
కాపురం అనంతపురానికి మారింది.
"మన బిడ్డ చదువుకుంటే,మన లాగ కస్టాలు పడదు"అని కొడుకుని తీసుకుని స్కూల్ కెళ్లాడు.
అక్కడ కూడా "ఎం కులం?"అని అడిగారు.
రామన్న కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు."ఎం కులమంటే పలకవేం?"గుమస్తా గద్దించాడు.
"నీ ఇష్టమొచ్చిన కులం రాసుకో"అన్నాడు.
స్కూల్ లో చేర్చుకున్నారు.
పిల్లవాడికి ఎక్కడా ఏ లోటు రాకూడదని భార్యభర్తలిద్దరు బండ కష్టం చేశారు.రామన్న మట్టి పని చేశాడు.రాళ్ళు మోశాడు.కట్టెలు కొట్టుకొచ్చి అమ్మేవాడు.లచ్చమ్మ ఒక దొర ఇంట్లో పనిమనిషిగా కుదురుకుంది.
ఎప్పుడైనా ఊళ్ళో ఉన్న తన ఇల్లు,కాసింత భూమి గుర్తుకొచ్చేది రామన్నకి.వాటిని అమ్మడానికైనా,ఆ ఊరు వెళ్ళాలంటే అతనికి మనసోప్పింది కాదు.
లచ్చమ్మకి మాత్రం,బిడ్డని తన చేతిలో పెట్టి చీకటిలో కలిసిపోయిన తల్లి గుర్తుకొచ్చేది.ఏదో ఒక రోజు ఆమె వచ్చి'నా బిడ్డను నాకిచ్చేయి'అంటుందేమోనని భయం వేసేది.
కొడుకు బాగా చదువుతున్నాడని అందరు అంటూ ఉండేసరికి దంపతులిద్దరూ ఆనందంలో మునిగిపోయేవాళ్ళు.
ప్రతి క్లాసు మంచి మార్కులతో పాసవుతుంటే,కొడుకు కోసం వాళ్ళిద్దరూ గొడ్లకంటే హీనంగా పగలు రాత్రి కష్టపడేవాళ్ళు.
లాంతరు వెలుగులో కొడుకు చదువుకుంటూ ఉంటే,తండ్రి కూడా తోడుగా మేల్కునేవాడు.తల్లి గంటకొక సారి తెచ్చే పాలు తాగలేక కొడుకు విసుక్కుంటూ ఉంటే ,మురిపెంగా చూసేవాడు రామన్న.
ఒక రోజు కాలేజీ నుండి ఇంటికొచ్చిన కొడుకు,తల్లి వైపు విషాదంగా చూస్తూ "అమ్మా ఈ రోజు మా కాలేజీలో ఒకడు నన్ను జోన్నలోడా అని వెక్కిరించాడమ్మా" అన్నాడు.
ఆ మాట వినగానే లచ్చమ్మ ఉలిక్కిపడింది.
"చిన్నప్పుడు నన్నలా పిలిస్తే అర్థం అయ్యేది కాదమ్మా,ఇప్పుడు వయసు పెరిగింది కదా అన్ని అర్థమవుతున్నాయి"అన్నాడు.
తల్లి కళ్ళలో నీళ్ళు కదలాడాయి.
"పది సర్ల జోన్నలిచ్చి నన్ను కొనుకున్నారా అమ్మా?" కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా అడిగాడు కొడుకు.
లచ్చమ్మ ఆ మాటలకు వెక్కి వెక్కి ఏడవసాగింది.
"ఇన్ని కస్టాలు,అవమానాలు ఎట్లా భరించారమ్మ"అని అడిగాడు కొడుకు.
"మమకారం నాయనా"అని గొనుక్కుంది లచ్చమ్మ.
"ఇక మీదట జొన్నలు అనే పేరు విని మనం అవమానపడక్కరలేదమ్మా.ఇక నుంచి అదే మన ఇంటి పేరు"అన్నాడు కొడుకు తల్లి ఒళ్లో తల దాచుకుంటూ.
తనని అమ్మేసిన ఆ రాత్రి ఎం జరిగిందో,తనని ఎలా పెంచారో తల్లి తండ్రుల నుంచి కధలు కధలుగా వింటూ పెరిగాడు ఆ కొడుకు.
"నాన్నా........సభ అయిపొయింది"ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు ముసలాయన.జీవన మూలాలలోకి మనసు ప్రయాణం చేసి వచ్చింది.మనసుకి మించిన విస్తృత యాత్రికుడు లేనేలేడు కదా! అనుకున్నాడు.
సభకు వచ్చిన వాళ్ళంతా ముసలాయనకి నమస్కారాలు చేశారు.
"జొన్నల తాతగారు.ఈయన ఎంతో కష్టపడి చదువుకోవడంవల్లే పిల్లలు ఇంత వృద్ధిలోకి వచ్చారు....."అని ఎవరో గుసగుసలాడుతున్నారు.
"కష్టపడింది నేను కాదు,నా తల్లితండ్రులు" అనుకున్నాడు ముసలాయన.
చనిపోయేముందు తన తండ్రి ఆఖరు కోరిక గుర్తుకొచ్చింది.తనతో పాటు కాసిన్ని జొన్నలు కూడా పాతిపెట్టమని అడిగాడు అయన.
"నా జీవితంలో శానా సంతోషాన్ని ఇచ్చాయి ఈ జొన్నలు.వాటిని కూడా నాతో పాటు ఉంచు"అని అడిగాడు.
ఇక తన తల్లి నిద్రలోనే మృతి చెందింది.తనకి మంచి ఉద్యోగమొచ్చి పెళ్ళయి,బిడ్డ పుట్టిన తర్వాత వాడిని చూడడానికి అనంతపురం నుండి ఢిల్లీకి వచ్చింది.బిడ్డని చూసి విపరీతంగా ఆనందపడి ఆ రాత్రే నిద్రలో చనిపోయింది.
జ్ఞాపకాలు....అన్ని జ్ఞాపకాలు.
ముసలాయన్ని మెల్లిగా వీల్ చైర్లో కూర్చోబెట్టారు.కారులో వంద కిలోమీటర్లు ప్రయాణించి ఇల్లు చేరుకున్నారు.
అప్పుడే టీవిలో డాక్టర్ జొన్నల సన్మానం గురించి చెబుతున్నారు.
అందరూ భోజనాలకు కూర్చున్నారు.కోడలు,మనుమలు ,మనుమరాళ్ళతో అంతా సందడిగా ఉంది.
టేబుల్ పైన ఏవేవో పదార్థాలు వడ్డించారు.ముసలాయన వాటివైపు నిర్లిప్తంగా చూశాడు.
"నాన్నా..... మర్చిపోయాను.మీ కోసం స్పెషల్ చేయించాను" అంటూ కొడుకు ఒక గిన్నెపై ఉన్న మూత తీశాడు.
అందులో ఉన్నది జొన్నరొట్టెలు.
ముసలాయన కళ్ళు మెరిశాయి.
వణుకుతున్న చేతులతో ఆ రొట్టెలను తీసుకుని కళ్ళకద్దుకున్నాడు.
గమనిక:మీరు చదివిన ఈ కధ ఆరు సంవత్సరాల క్రితం ఒక పుస్తకం లో ప్రచురించబడింది.జి.ఆర్.మహర్షి. గారి ఈరచనకు నా జోహార్లు .